AP: క్యాపిటల్ వ్యయంలో అట్టడుగున ఏపీ
అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించగా ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం ఏడు వేల కోట్ల రూపాయలకు లోపే;
రాజధాని కూడా లేని రాష్ట్రం. మనుగడ కోసం ఆస్తులను సృష్టించక తప్పని పరిస్థితి. అయినా మూలధన వ్యయం ఖర్చు చేయడంలో ఏపీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి పోవడం ఆందోళం కల్గిస్తోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కాని బటన్ నొక్కుడు తప్ప కొత్త ఆస్తుల కల్పన విషయంలో ఏపీది మొద్దు నిద్ర. అందుకే క్యాపిటల్ వ్యయంలో దేశంలో అట్టడుగున నిలిచి ఓ చెత్త రికార్డు తన పేరున రాసుకుంది.
ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు,ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయలు, విద్యా రంగంలో మౌలిక సదుపాయాలపై పెట్టే ఖర్చును మూలధన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయం వల్ల సంపద సృష్టి జరుగుతుంది. ఈ ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో ఆదాయం సమకూరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆర్థిక వేత్తలు అంటారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి రాష్ట్రం మూలధన వ్యయంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో మూలధన వ్యయం భారీగా పెట్టాల్సి ఉంటుంది. కాని ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారింది.
దేశంలోనే అత్యంత సంపన్న సీఎం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాని మూలధన వ్యయంలో పాతాళానికి చేరింది. 25 రాష్ట్రాల మూలధన వ్యయాలను పరిశీలిస్తే.. ఏపీనే లాస్ట్‌లో ఉంది. వివిధ రాష్ట్రాల్లో మూలధన వ్యయం ఎలా ఉందనే అంశంపై ప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ నివేదిక తయారు చేసింది. ఈ విషయంలో పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం మన దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఏపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంద.ఇ చివరకు దేశంలోనే అతి చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, త్రిపుర కంటే కూడా ఏపీలో మూలధన వ్యయం తక్కువగా ఉండటం ఆందోళన కల్గించే అంశం.2022-23 బడ్జెట్ మూలధన వ్యయం కోసం అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించగా ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం ఏడు వేల కోట్ల రూపాయలకు లోపే ఉండటం ఏపీ రాష్ట్ర దివాళ తనాన్ని బయటపెడుతుంది.
చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్ మూలధన కేటాయింపుల్లో 50 శాతం, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టగా .. ఆంధ్రప్రదేశ్‌లో అది ఇది కేవలం 23 శాతం మాత్రమేనని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. అసాధారణంగా అప్పులు చేస్తూ, ఎడతెగని ఖర్చులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పన, ప్రజల ఆదాయం పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే అంశాన్ని బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. కర్ణాటక, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు తమ బడ్జెట్ మూలధన కేటాయింపులకు కంటే అధికంగా ఖర్చుపెట్టడం విశేషం.