తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసు ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఈ కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంతా ఉలిక్కి పడ్డారు. పరకామణిలో చోరీ చేసిన వ్యక్తితో రాజీ చేయించడం ఏంటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి శ్రీవారికి వచ్చిన కానుకలను దొంగతనం చేస్తే.. అతని నుంచి కొన్ని ఆస్తులను బోర్డుకు రాయించుకుని కేసును రాజీ చేయడం సరికాదని కోర్టు తెలిపింది. ఈ కేసును విచారించాలంటూ సీబీసీఐడీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అలాగే రవికుమార్ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
రవికుమార్ ఆస్తులను క్లుప్తంగా పరిశీలించాలని.. ఆయన ఆస్తులు ఎవరెవరికి మళ్లించారు అనే కోణంలోనూ విచారణ జరపాలని తెలిపింది. ఈ కేసులో గత టీటీడీ బోర్డును కూడా విచారించాలంటూ తెలిపింది కోర్టు. దీంతో గత టీటీడీ బోర్డు సభ్యుల గుండెల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. గత టీటీడీ బోర్డు సభ్యులు ఇలా ఎందుకు చేశారు.. ఈ రాజీ కుదర్చడంలో వారి పాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారించాలని కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. ఎందుకంటే రవికుమార్, ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ ఈ చోరీ కేసును లోక్ అదాలత్ లో రాజ చేసుకోవడంపై తీవ్ర అనుమానాలు లేవనెత్తింది హైకోర్టు. ఈ రాజీ కుదర్చడంలో టీటీడీ బోర్డు సభ్యుల పాత్ర చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ రవికుమార్ ఎప్పటి నుంచి ఇలా చోరీలు చేస్తున్నాడు.. ఎందుకు అవన్నీ బయటకు రాలేదు అనే కోణంలోనూ ఇప్పుడు సీఐడీ విచారణ జరపబోతోంది. అతనితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి.. ఎవరి అండతో అతను ఇలా చోరీలు చేశాడనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. అసలే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సొమ్ము అది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కానుకల విషయంలో తప్పు చేస్తే ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇందులో ఎవరి పేరు బయటకు వస్తుందో.. ఎవరు అరెస్ట్ అవుతారో చూడాలి.