Andhra Pradesh: తుపాకులు కావాలంటున్న నాయకులు

గన్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని పోలీసులు సూచించారు.;

Update: 2023-06-27 11:41 GMT

విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్‌ చేయడంతో ప్రముఖులు అప్రమత్త మయ్యారు. ఆత్మరక్షణ కోసం ఆయుధం ఉండటం అవసరమని వీళ్లకు ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. రాజకీయ,వ్యాపార ప్రముఖులు గన్‌లైసెన్స్‌ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన కుమారుడు శరత్‌ చౌదరి గన్‌ లైసెన్స్‌ కోసం ఇప్పటికే నగర పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించారు. తమపై భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశముందని ఎంపీ భావిస్తున్నట్టు సమాచారం.

గన్‌ లైసెన్స్‌ కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకుంటే మంచిదని పోలీసులు సూచించగా... ఎంపీ, ఆయన కుమారుడు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా గన్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. గన్‌ లైసెన్స్‌ జారీ చేయాలంటే పోలీస్‌ శాఖతోపాటు స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం విశాఖ నగర పరిధిలో 600 మందికి గన్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. అందులో 400 మందికిపైగా మాజీ సైనికులే. వీరంతా బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మరో 150 నుంచి 200 మంది వరకూ రాజకీయ, వ్యాపార ప్రముఖులకు గన్‌ లైసెన్సులు ఉన్నాయి.

Tags:    

Similar News