AP: మద్యం కుంభకోణంలో మాటల యుద్ధం
విజయసాయిరెడ్డి- రాజ్ కసిరెడ్డి ఆరోపణలు.. వైసీపీ చుట్టూనే ఆరోపణలు;
ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్కామ్‌లో కీలకంగా చర్చకు వస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి – రాజ్ కసిరెడ్డిల మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ కేసుకు కొత్త మలుపులు తేగలవన్న అంచనాలను పెంచుతున్నాయి. శుక్రవారం నాడు సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి… ఈ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డేనని వ్యాఖ్యానించారు. “అతడు తెలివైన క్రిమినల్. పార్టీలో ఎంతో ప్రోత్సహించాం. కానీ అతడే మోసం చేశాడు. స్కామ్‌లో అన్నీ ఆయనకే తెలుసు,” అంటూ తేల్చేశారు.
కసిరెడ్డి ఆడియో క్లిప్ విడుదల
అయితే, తాజాగా రాజ్ కసిరెడ్డి స్పందిస్తూ ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. తాను ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు తన నివాసానికి, కార్యాలయానికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితుల్లో ఉన్నా, ఈ సమయంలో తనపై బురద జల్లడం అన్యాయమన్నారు. ఆడియోలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుబట్టారు. “విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై త్వరలోనే స్పందిస్తా. నా న్యాయపోరాటం తర్వాత మీడియా ముందుకు వస్తాను. ఆయన చరిత్రను పూర్తిగా బయటపెడతా,” అంటూ గట్టిగానే హెచ్చరించారు రాజ్ కసిరెడ్డి. ఆయన వ్యాఖ్యల ప్రకారం, ఈ స్కామ్‌కు సంబంధించి ఇంకా బయట పడని అంశాలున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని.. రాజ్ కసిరెడ్డిగా కూడా పిలుస్తారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. విదేశాలలో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే..
రాజ్ కసిరెడ్డి ఆరోపణలతో విజయసాయిరెడ్డి కూడా స్కామ్‌లో భాగమా? లేక ఈ వారిద్దరి మధ్య వార్ జరుగుతోందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకరిపై మరొకరు "నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ" అంటూ ఆరోపణలు చేసుకుంటుండటంతో, ఈ వ్యవహారం ప్రజల దృష్టిలో పోలీసు – దొంగాటలా కనిపిస్తోంది. ఇక మరో కోణంలో చూస్తే, విజయసాయిరెడ్డి పాత్రపై రాజ్ కసిరెడ్డి విసురుతున్న సంకేతాల వెనక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా వినిపించటం విశ్లేషకులదృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఆ విషయాల్లో బయటకొచ్చే అవకాశం తక్కువగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, విజయసాయి – రాజ్ కసిరెడ్డిల మధ్య ఈ మాటల యుద్దం, రాజకీయ నాటకాలు లిక్కర్ స్కామ్‌ను మరింత గందరగోళంగా మార్చుతున్నాయి. నిజాలెప్పుడూ వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే! వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో ఆయన పాత్రపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో విజయసాయిరె విచారణకు హాజరయ్యారు.