AP Municipal Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. ప్రతిపక్షాలపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు..

AP Municipal Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కాక రేపుతున్నాయి.

Update: 2021-11-09 01:30 GMT

AP Municipal Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కాక రేపుతున్నాయి. ప్రతిపక్ష అభ్యర్థులపై వైసీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని బెదిరిస్తూ.. అధికార పార్టీ నేతలంతా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల ఆగడాలపై సామాన్యుల్లో సైతం నిరసన వ్యక్తమవుతోంది.

నామినేషన్లు అడ్డుకోవడం మొదలు కొన్ని తిరస్కారానికి గురవడం వెనుక కూడా YCP కుట్ర ఉందని టీడీపీ మండిపడుతోంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా ఈ ఎన్నికలు మారాయని విమర్శిస్తోంది. వైసీపీ అరాచాకాలు, దౌర్జన్యాలకు నిరసనగా టీడీపీ నేతలు నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఇంత దుర్మార్గమైన ఎన్నికలను రాజకీయ జీవితంలో చూడలేదన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు. ఎన్నికల కమిషన్‌ పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని మండిపడ్డారు.

ఇటు కుప్పంలోనూ ఇదే పరిస్థితి. మున్సిపాలిటీలో 13,14,15 వార్డుల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 14వ వార్డులో వైసీపీ ఏకగ్రీవం అయినట్లు ప్రకటించడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మున్సిపల్‌ కమిషనర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు.

మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి షర్టు చింపేశారు. నేతల్ని బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాము కుప్పంలో లేకపోయినా.. సంతకాలను ఫోర్జరీ చేసి.. నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని 14వ వార్డు టీడీపీ అభ్యర్థులు తిరుమగల్‌, ప్రకాశ్‌ వాపోయారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు వీడియోలు ఉంటే చూపించాలన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

జగన్‌ సర్కారు తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలను ఫార్స్‌గా తయారు చేశారన్నారు. అక్రమాలు, దౌర్జన్యాలు, దురాగతాలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఎస్‌ఈసీ, కలెక్టర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అభ్యర్ధుల జాబితాను ప్రకటించకుండా ఏకగ్రీవాలను ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు చంద్రబాబు.

అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే తప్పుడు సంతకాలతో నామినేషన్లు ఉససంహరించుకున్నట్లు ప్రకటిస్తున్నారని టీడీపీ అభ్యర్థులు మండిపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News