AP: విశాఖ డ్రగ్స్ మాఫియాపై పోలీసుల నిఘా
డ్రగ్స్ దందాపై తీవ్రంగా స్పందిస్తోన్న పోలీస్ శాఖ;
విశాఖ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ దందాపై పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని పాఠశాలలు, కళాశాలల సమీపాల్లో డ్రగ్స్ విక్రయం జరుగుతోందన్న సమాచారంతో సీపీ విరాజశను నేతృత్వంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొదట తక్కువ ధరకే అందించి, ఆపై మత్తులోకి దించుతున్న ముఠాలు, విద్యార్థులను మానసికంగా బానిసలుగా మార్చేస్తున్నాయి. ఈ మత్తుకు లోనైన యువత పలు నేరాలకు పాల్పడి, చిన్న వయసులోనే నేరస్తులుగా మారుతున్న ఘటనలు పెరుగుతుండటంతో, సీపీ నేరాల అడ్డుకట్టకు ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖలోని ప్రతి మూలన నిఘా పెంచి, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి విశాఖలోకి ప్రవేశించి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముఠాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ మాఫియా ను కూకటి వేళ్లతో తొలగించేందుకు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజం మొత్తం గళమెత్తాల్సిన అవసరం ఉంది.
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
అన్నమయ్య జిల్లా టీ.సుండుపల్లి మండలంలోని కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించి అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిని 2025, జూలై 5న ఉదయం అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ.యం.వెంకటాద్రి తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోవిందన్ వద్ద నుంచి రూ.81,10,000 విలువైన 26 ఎర్రచందనం దుంగలు, ఒక కీప్యాడ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు ఎర్రచందనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. విచారణలో మరి కొంతమంది తమిళనాడు స్మగ్లర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసిందని, వారిపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ వరప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.