AP: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
దిగ్విజయమైన విశాఖ పెట్టుబడుల సదస్సు
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. మూడు రోజుల్లో 613 ఒప్పందాలు.. 12 రంగాల్లో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు.. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.. ఇవన్నీ విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఫలాలు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకున్నారు. పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరుస్తున్న ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంచారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు అని ప్రకటించినా.. ఒకరోజు ముందే నగరంలో పెట్టుబడుల సందడి మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక ప్రతినిధులతో విశాఖలో ఓ మినీ ప్రపంచపు సందడి కనిపించింది. 16 నెలల కిందటి వరకు ఏపీ అంటేనే వణికిపోయి, రాష్ట్రాన్ని వదిలిపోయిన పారిశ్రామికవేత్తలు సైతం ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ బారులు తీరారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత.. తామూ అదే రంగంలో పెట్టుబడులకు సిద్ధమంటూ ప్రముఖ సంస్థలు విశాఖ తలుపుతట్టాయి. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థలు 1,000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెద్దపెద్ద సంస్థలే కాదు, వైకాపా ప్రభుత్వ వేధింపులకు బలైనవారు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నోచుకోక ఇబ్బందులు పడిన వారూ కొత్త పెట్టుబడులకు ఉత్సాహంతో ముందుకొచ్చారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వచ్చే ఏడాది మళ్లీ నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోనే సదస్సు నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా విశాఖ తీరాన ‘ఆంధ్ర మండపం’ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందే ఏపీ ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. గురువారం ఒక్క రోజే 35 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
భాగస్వామ్య సదస్సులో చేసుకున్న రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను మూడున్నరేళ్లలో ఆచరణలోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘‘ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. పెట్టుబడిదారులతో ముందే అన్నీ మాట్లాడాం. నిబద్ధత ఉన్నవారితోనే ఒప్పందాలపై సంతకాలు చేశాం. వారిలో ఎవరికైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వస్తే తప్ప.. మొత్తం ప్రతిపాదనలన్నీ ఆచరణలోకి వస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం పెట్టుబడిదారుల సదస్సు ముగిశాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లలో 50లక్షల ఉద్యోగాలు, పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని 50 లక్షలకు పెంచుతున్నానని తెలిపారు.
రూ.3,65,304 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 1,26,471 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. శుక్రవారం 40 సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ రెండు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం 75 ఎంవోయూలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5,42,361 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. భాగస్వామ్య సదస్సు సందర్భంగా సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.