AP: మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహానికి వేదికగా "హబ్".. టాటా.. భారత జాతి ముద్దు బిడ్డ: చంద్రబాబు... టాటా ఆలోచనలకు అనుగుణంగానే ఇన్నోవేషన్ హబ్;
ఆంధ్రప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు నాంది పలికింది. మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ఈ హబ్‌ను ప్రారంభించారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హబ్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లకు కొత్త దిశగా నిలవనుందని అధికారులు వెల్లడించారు. అమరావతిని కేంద్రంగా తీసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ హబ్ డీప్‌టెక్, కృత్రిమ మేధ, సుస్థిర ఆవిష్కరణలు, సమ్మిళిత టెక్నాలజీలకు వేదిక కానుంది. అమరావతిని “క్వాంటమ్ వ్యాలీ”గా మార్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రపంచస్థాయి ప్రతిభను ఆకర్షించడం, పెట్టుబడులు రప్పించడం, ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ‘దేశానికి ఏదైనా చేయాలని రతన్‌టాటా తపించేవారు. సమాజసేవకు ఆయన జీవితాంతం కృషి చేశారు. ప్రతిఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారు. ఆయన మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారు. రతన్‌టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే నా నినాదం. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశాను. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తించాను. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.
టాటాకు అంకితం: నారా లోకేశ్
వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పని చేస్తుందన్నారు. ఇందుకనుగుణంగా విద్యా వ్యవస్థ పునాదులు బలోపేతం చేసి విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ముందున్న సవాళ్లకు తగ్గట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకునే కార్యాచరణతో పనిచేస్తున్నట్లు చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తున్నందున దేశానికి ఏపీ ఆవిష్కరణల హబ్‌గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.