ఏపీలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయండి. హాల్‌టికెట్లను చూపి పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆరు లక్షల మంది విద్యార్థులకుపైగా...
ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు మాధ్యమంలో 51,069 మంది.. ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.