రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. గతంలో రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం అనంతపురంలో ‘చాయ్ పే చర్చ’లో వివిధ వర్గాలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎవరు ఏ పర్యటన చేపట్టినా దేవుని గడప కడపను సందర్శించాల్సిందేనని అన్నారు.
రాయలసీమలో తిరుపతి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయని మాధవ్ తెలిపారు. అందుకే కడప నుంచే తన పర్యటన ప్రారంభించినట్లు చెప్పారు. అనంతపురం నగరంలో వివిధ వర్గాల వారిని కలిసి.. ఈ ప్రాంత సమస్యలు కూడా తెలుసుకున్నట్లు తెలిపారు. రాయలసీమ అత్యంత వెనుకబాటుకు గురైందని.. ఈ ప్రాంతం నుంచి అనేక ముఖ్యమంత్రులు వచ్చినా న్యాయం జరగలేదన్నారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.