AP: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల వల్లే...!
విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ... సుదీర్ఘంగా సాగిన విచారణ;
బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వేధింపుల కేసులో వైసీపీ నేతలకు, కొందరు ఐపీఎల్ అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. తనపై తప్పుడు కేసు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకపాత్ర పోషించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని తనను వేధింపులకు గురి చేశారని కాదంబరీ వివరించారు. విజయవాడలో తనపై కేసు నమోదు చేయడానికి ముందే.. ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబై పంపించి, తమ ఇంటివద్ద రెక్కీ చేశారని కాదంబరీ... విజయవాడ సీపీకి వివరించారు. అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని.. ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి, కేసు నమోదుచేశారని అన్నారు. వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చి.. ముంబైలో కేసును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని కాదంబరీ జత్వానీ విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన కాదంబరీ జత్వానీ.. అక్కడినుంచి పోలీసు బందోబస్తు మధ్య తన తల్లి ఆశా జత్వానీతో కలిసి చేవిజయవాడకు రుకున్నారు. నేరుగా నోవోటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు తన న్యాయవాదులతో చర్చించారు. పోలీసులకు ఇచ్చే వాంగ్మూలం తయారీ, విచారణ అధికారికి అందజేయాల్సిన ఆధారాల గురించి వారితో సమాలోచనలు జరిపారు. సాయంత్రం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును తన తల్లితో పాటు కలిశారు. తనపై తప్పుడు కేసు పెట్టి పోలీసులు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం విచారణ అధికారి అయిన ఏసీపీ స్రవంతిరాయ్‌ను కలిసిన కాదంబరీ ఫిర్యాదు కాపీ అందజేశారు. తనవద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో, ఫొటోలను విచారణ అధికారికి ఇచ్చారు. సాయంత్రం 6.15 గంటలకు మొదలైన విచారణ, రాత్రి 10.15 గంటల వరకు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినా సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని కాదంబరి వివరించారు. తాను పలువురిని హనీట్రాప్ చేసినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. ముంబయిలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నానని, ఆ చిరునామాతో 2018 తేదీతో బోగస్ ఒప్పందపత్రాన్ని సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు. తన ఇంటిపత్రాలను అందజేశారు. వృద్ధులైన తన తల్లిదండ్రులను కేసులో అనవసరంగా ఇరికించారని చెప్పారు.