AP: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్

ఇక నుంచి తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం.. వెల్లడించిన మంత్రివర్గ ఉప సంఘం;

Update: 2024-09-18 04:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు మంత్రివర్గ ఉప సంఘం శుభవార్త చెప్పింది. ఎక్సైజ్ పాలసీపై చర్చించేందుకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ.. ఇక నుంచి తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమలు చేస్తామని తెలిపింది. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని.. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తామని పేర్కొంది.

వైసీపీపై తీవ్ర విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని... సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారని కొల్లు రవీంద్ర అన్నారు. వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారని... 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారని... ఆ తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారని తెలిపారు. దీంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందన్నారు.

నాసిరకం మద్యంతో అనారోగ్యం

నాసిరకం మద్యం తాగి చాలామంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారని కొల్లు రవీంద్ర తెలిపారు. సమస్యలు, పెరాలసిస్ వంటి సమస్యలతో మంచానపడ్డారు. డిస్టలరీస్ వ్యవస్థను కూడా వారి చేతుల్లోకి తీసేసుకున్నారని వెల్లడించారు. గత ఐదేళ్లలో వారి అక్రమ మద్య విధానంపై ఎన్నో పోరాటాలు చేశామని... దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు దారి మళ్లించారని తెలిపారు.

సెప్టెంబరుతో గత మద్యం పాలసీ ముగింపు

6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశామని మంత్రులు తెలిపారు. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నడుపుతున్న మద్యం షాపుల విధానాలను అధ్యయనం చేశారన్నారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను నేడు కేబినెట్ ముందు ఉంచుతామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విక్రయాలను నిలిపివేశామన్నారు.

Tags:    

Similar News