AP: ఇంటింటి ప్రచారాలు... రోడ్ షోలు
నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో అభ్యర్థుల ముమ్మర ప్రచారం;
ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఓట్ల వేటలో ముందుకు సాగుతున్నారు. కూటమి అభ్యర్థులు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిస్తున్నారు. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్... ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ప్రజా దీవెన యాత్ర చేపట్టి..... స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామ్మోహన్ తరఫున భార్య గద్దె అనురాధ, కుమారుడు రాజేష్, క్రాంతికుమార్ ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికీ తిరిగి అందరినీ అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నందిగామలో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేపట్టారు. బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ... మండలంలోని నరసాయపాలెం, కంకటపాలెం, మురుకొండపాడు గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలసి ప్రచారం నిర్వహించారు.
వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ జోరుగా ఇంటింటి ప్రచారం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైకాపా రెబల్‌గా బరిలో నిలిచిన అల్లె ప్రభావతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థి పార్ధసారధి రోడ్‌షో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని పూలకుంటపల్లిలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతూ... పూల వర్షం కురిపించారు.
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని... పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లి మండలాల్లో కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నెల్లూరులో కూటమి అభ్యర్థి పి.నారాయణ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆత్మకూరులో కూటమి అభ్యర్థులు ఆనం రామనారాయణరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.... బుచ్చి మండలం చెల్లాయపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురయ్యారు. ఓ వైపు వైకాపా నేతల వ్యక్తిగత విమర్శలు... మరోవైపు ప్రజల ఆదరాభిమానాలు చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక మహిళలు మేమున్నామంటూ ఆమెకు అండగా నిలిచారు.