Car Accident: కోటి రూపాయల బంగారు నగలతో ప్రయాణం.. రోడ్డు యాక్సిడెంట్‌లో ఇద్దరు వ్యాపారస్తులూ..
Car Accident
బంగారం వ్యాపారం చేస్తే ఇద్దరు వ్యాపారస్తులు దుకాణానికి కావలసిన నగలను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు వ్యాపారులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. రామగుండం రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న సంతోష్ కుమార్, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని వివిధ బంగారు దుకాణాలకు బంగారం విక్రయిస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరివద్ద కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఘటనా స్థలికి వచ్చిన గోదావరిఖని 108 సిబ్బంది బంగారు ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్‌ఐ శైలజకు అప్పగించారు. నిజాయితీగా బంగారు ఆభరణాలు అప్పగించిన 108 సిబ్బందిని పోలీసులు అభినందించారు.