CBN: సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం
నేటి నుంచి చంద్రబాబు కీలక చర్చలు... నేడు ప్రవాసాంధ్రులతో భేటీ;
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో కాలుమోపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తన మంత్రులతో కలసి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం సింగపూర్ చేరుకున్న సీఎం బృందానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు అక్కడి తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. చిన్నారులు కూచిపూడి నాట్యంతో ఘన స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం, మంత్రులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు.
ఆరు రోజుల టూర్
నేటి నుంచి 31 తేదీ వరకు 6 రోజులపాటు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. అక్కడి దిగ్గజ బిజినెస్ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీఅవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం... రెండో విదేశీ పర్యటనగా సింగపూర్‌కు వెళ్లారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు టీం ఈ పర్యటనను వేదిక చేసుకోనుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించబోతున్నారు. వీలైనంత ఎక్కువ పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు చంద్రబాబు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా టూర్
ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమి కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.