CBN: జగన్.. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా.? చంద్రబాబు
వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్
‘మొన్నటి వరకు వైసీపీ నేతలు సిద్ధం, సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా..! అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సిద్ధమా. మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమా. వివేకా హత్య, కోడి కత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్‌విసిరారు. క్లైమోర్ మైన్లతో పేల్చినా తాను చలించలేదని, మీలా డ్రామాలు ఆ డ లేదని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇవాళ పేదల సేవలో కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట మండలం మునక్కాయల వారిపల్లెలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ అందించారు. అనంతరం బోయినపల్లి ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు
రాజకీయ జీవితంలో తాను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే తన ఆశయమన్నారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. "ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారు. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. గత పాలకులు అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. వైకాపా హయాంలో అనర్హులు కూడా దివ్యాంగుల పింఛను తీసుకున్నారు. నిజమైన దివ్యాంగులకు మేం న్యాయం చేస్తాం. అనర్హులు పింఛను తీసుకోకుండా ప్రజలే ఆపాలి. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు."అన్నారు.
అరాచక వ్యక్తులు
పల్నాడు జిల్లాలో వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారు. తిరిగి మాపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌లో చనిపోయాడంటూ అతడి భార్యతోనే అబద్ధాలు చెప్పించారు. మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారు. ఆడబిడ్డలపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మహిళలను ఏడిపించిన వారిని చట్టం ఎదుట నిలబెడతాం’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘కరవు సీమకు సాగునీటిని తీసుకురావడానికి పునాదులు వేసింది ఎన్టీఆరే. కుప్పానికి నీరు తీసుకెళ్లాను. భవిష్యత్తులో రాజంపేట, రైల్వేకోడూరు, చిత్తూరు ప్రాంతాలకూ సాగు నీరిస్తాం. సీమకు పెద్దఎత్తున పెట్టుబడులు రప్పిస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్టయింది. నా బలం.. బలగం ప్రజలే. ఏటా లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని సీఎం తెలిపారు.