CBN: దేశ ఐటీ హబ్‌గా విశాఖ
విశాఖకు తరలివస్తున్న దిగ్గజ కంపెనీలు... శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన... ఇప్పటికే గూగుల్, టీసీఎస్, యాక్సంచర్.. తాము వచ్చాక 125 కంపెనీలు వచ్చాయి
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో ఇంకా 50 వేల గదులు రావాలన్నారు. దసరా ఉత్సవాల్లో కోల్‌కతా, మైసూర్ సరసన విజయవాడను చేర్చాం అని సీఎం చంద్రబాబు వివరించారు.
విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ
ఏవియేషన్ రంగంలోనూ ఒక యూనివర్సిటినీ విశాఖలో ఏర్పాటు చేయలని భావిస్తున్నామని చంద్రభాబు వెల్లడించారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించామని వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో కియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో ఉత్పత్తి చేస్తోందన్న చంద్రబాబు. 2014 -19 మధ్య కియా కార్లను ఉత్పత్తి చేయటంతో పాటు ఓ మోడల్ టౌన్ షిప్ ను కూడా అభివృద్ధి చేసింది. ఇసుజు, హీరోమోటార్స్ లాంటి సంస్థలు కూడా మా హయాంలోనే ఏపీకి వచ్చాయన్నారు.
15 నెలల్లో 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు. ఏయే రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే అంశాన్ని వెల్లడించారు సీఎం చంద్రబాబు.మెగా డీఎస్సీ ద్వారా 15,941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు క్లారిటీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం ద్వారా 5,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ప్రైవేట్ సెక్టార్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎంస్‌ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో మొత్తం 3.48 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎవరూ ఎక్కడ, ఎప్పుడూ ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న చంద్రబాబు.. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. 10 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు జరిగాయని రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 6.29 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.