ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసులో వాస్తవాల్ని తెలుసుకునేందుకు మైనారిటీ జేఏసీ నేడు చలో నంద్యాలకు సిద్ధమైంది. జేఏసీ ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటీ నంద్యాలలో పర్యటించనుంది. కేసులో అరెస్టయిన సీఐ, కానిస్టేబుల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయడంపై జేఏసీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలకు వెళ్లి... అక్కడి పరిస్థితులను పరిశీలించి వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆత్మహత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఫా స్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సలాం కేసును త్వరగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను శ్రవణ్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అటు... సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ... ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో ముస్లింలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సలాం కుటుంబం ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కేశినేని భవన్ వద్దే కాగడాలు, కొవ్వుతులు ప్రదర్శించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు క్యాండిల్‌లు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.