గత వైసిపి పాలనలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఒక సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ ప్రజలను కలిసింది లేదు. జగన్ బయటకు వస్తున్నాడు అంటే చాలు. దారి పొడవునా చెట్లు కొట్టేయడం.. పరదాలు కట్టేయడం చూసేవాళ్ళం. జగన్ వస్తున్నాడు అంటే ఆ ఏరియాలో అడుగడుగునా పోలీసులు, తీవ్రమైన ఆంక్షలు, వీధి వ్యాపారాలన్నీ మూసేయడం ప్రజలను బయటకు రానీయకపోవడం.. కనీసం జగన్ ను కలవనీయకపోవడం లాంటివి చూశాం. ఎవరైనా పొరపాటున జగన్ దగ్గరకు ఏదైనా దరఖాస్తు పట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు లాగి పడేయడం.. అవసరమైతే లాఠీ చార్జ్ చేయడం కనిపించేవి. ప్రజలు ఎన్నుకుంటే సీఎం అయిన జగన్ అదే ప్రజలను కలవడానికి మాత్రం అసహ్యించుకునేవాడు. సీఎంగా ఉన్నన్ని రోజులు జగన్ ఒక నియంత లాగా వ్యవహరించాడు. అదే ఇప్పుడు చంద్రబాబు మాత్రం అలాంటివి ఏమీ లేకుండా సాదాసీదాగా వ్యవహరిస్తున్నారు.
ఆయన సీఎం హోదాలో ఎక్కడికి వెళ్లినా సరే ఒక్క చెట్టు కూడా కొట్టట్లేదు. ఒక్క పరదా కూడా కట్టట్లేదు. ప్రజల మధ్యకు వెళ్లి అందరినీ కలుస్తున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా సరే అక్కడ ప్రజల మధ్య ఎక్కువగా గడుపుతున్నారు. వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేస్తున్నారు. ప్రజలకు తనకు మధ్య పెద్దగా సెక్యూరిటీని పెట్టకుండా వాళ్లతో అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే.. ప్రజలకు దగ్గరగా ఉండటం. ప్రజలకు నాయకుడికి మధ్య సెక్యూరిటీ ఉంటే ప్రజల్లో నెగెటివిటీ ఏర్పడుతుంది. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా సరే సాదాసీదా వ్యక్తిగా వెళ్లి అందరినీ సరదాగా పరామర్శిస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వెళ్లి వీధి వ్యాపారులతో సరదాగా మాట్లాడారు. పెద్దగా సెక్యూరిటీ పెట్టుకోకుండా చాలా సింపుల్ గా వెళ్లారు. ఆయనను చూసిన వారంతా ఒక సీఎం ఇంత సింపుల్ గా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. అందరి దగ్గరికి వెళ్లి ఫోటోలు ఇస్తూ ఆప్యాయంగా పలకరించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల ఏదైనా లాభం జరిగిందా లేదా అని కస్టమర్లను కూడా అడిగారు.
వీధి వ్యాపారులకు ఉన్న సమస్యలతో పాటు స్థానికంగా కావాల్సిన వసతులను కూడా అడిగి తెలుసుకున్నారు. కొందరి నుంచి దరఖాస్తులు తీసుకొని అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా ఆదేశించారు. ఇది చూసిన వారంతా జగన్ కు చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడా గురించి మాట్లాడుతున్నారు. జగన్ వస్తే కనీసం మొఖం కూడా కనిపించకుండా చుట్టూ పోలీసులు ఉండేవారని.. కనీసం దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించడం చూస్తుంటే.. ఎంత సాదాసీదాగా ఉన్నాడో అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు.