SUPREME COURT: చంద్రబాబు లాయర్ల వాదనలు సాగాయిలా....
17ఏ వర్తిస్తుందన్న హరీశ్ సాల్వే... యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావించిన అభిషేక్ సింఘ్వీ...కక్ష సాధింపే అన్న సిద్ధార్థ లూథ్రా;
హరీశ్‌సాల్వే:
సుప్రీంకోర్టులో మొదట చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ 9న FIR నమోదైందని, అంతకుముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొనడం తప్పని వాదించారు. 2021 సెప్టెంబర్ 7న అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు అందిన లేఖ ఆధారంగా FIR నమోదు చేసినట్లు వాదించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారని వివరంచారు. అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచి పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికే పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని చేర్చిందని వివరించారు. సవరించిన చట్టం ప్రకారం అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్ సర్వెంట్లు చేసిన సిఫారసులు, నిర్ణయాలపై అధీకృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారీ విచారణ కానీ, దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదని వివరించారు. కానీ ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని మొత్తం తప్పంతా అందులోనే ఉందన్నారు. రిమాండ్ రిపోర్టులో పిటిషనర్‌కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారన్న సాల్వే అందులో చెప్పినవన్నీ సీఎం హోదాలో తీసుకున్న నిర్ణయాలే అన్నారు.
అభిషేక్ సింఘ్వీ
చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్ సిన్హా తీర్పులోని పేరా 118లో ఈ విషయం ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17A ని చేర్చారని అందువల్ల అంతకుముందు తీసుకున్న నిర్ణయాలపైనా..అధీకృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ, దర్యాప్తు చేపట్టడంకానీ కుదరదని సుప్రీంకోర్టు యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిందన్నారు. కాబట్టి చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తిగా తప్పని వాదించారు. FIR ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెపుతున్నందున కేసులన్నీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తాయని అభిషేక్ సింఘ్వీ చెప్పారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అని న్యాయమూర్తికి తెలుసని దాని ప్రకారం ఇది అధికార విధుల నిర్వహణ కిందకే వస్తుందని ప్రాథమికంగా తెలుస్తోందని సింఘ్వీ వాదించారు. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ప్రత్యేక కోర్టు విచారించడం, రిమాండ్ ఆర్డర్ జారీ చట్టబద్దంగా జరగలేదని సింఘ్వీ వివరించారు. లంచం తీసుకుంటూ దొరికిన వారికి మాత్రమే 17ఎ వర్తించదన్నారు.
సిద్ధార్ధ లూథ్రా;
పిటిషనర్‌పై ఒకదాని తర్వాత మరొక ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారని, ఇది కక్షసాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తోందని మరో రెండు కేసులు ఇప్పటికే సిద్దం చేశారని మరో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్ లిస్ట్ వారు దాఖలు చేసిన కౌంటర్లో ఉందని చెప్పిన సిద్దార్ధలూథ్రా... కోర్టుకు సమర్పించారు.
ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు:
ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో 17ఏ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ విచారణ మాత్రం 17ఏ సెక్షన్ రాక ముందే ప్రారంభమైనందువల్ల ఈ సెక్షన్ వర్తించదన్నారు.