Chandrababu Deeksha : చంద్రబాబు దీక్ష గ్రాండ్ సక్సెస్.. !
Chandrababu Deeksha : జనం కాదు.. ప్రభంజనం.. టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు తరలివచ్చిన అభిమాన సంద్రం.. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది.;
Chandrababu Deeksha : జనం కాదు.. ప్రభంజనం.. టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు తరలివచ్చిన అభిమాన సంద్రం.. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రభుత్వ ఉద్రవాదంపై పోరు పేరుతో చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు ఊహించిన రీతిలో రెస్పాన్స్ వచ్చింది.. టీడీపీ అధినేతకు సంఘీభావం వెల్లువెత్తింది. వేలాదిగా వచ్చిన అభిమానులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం అభిమాన సంద్రాన్ని తలపించింది.. చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు మంగళగిరికి పోటెత్తారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో క్యూ కట్టారు.. బస్సుల్లో, కార్లలో, సొంత వాహనాల్లో పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు నేతలు, కార్యకర్తలు..
గురువారం ఉదయం చంద్రబాబు దీక్ష మొదలు పెట్టిన దగ్గర్నుంచి ముగింపు వరకు నేతలు, కార్యకర్తలతో టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సందడి వాతావరణం కనిపించింది. దీక్షకు ముందు కార్యకర్తలు అక్కడికి రాకుండా అడ్డంకులు సృష్టించినా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా జన ప్రవాహం ముందు అవేవీ నిలబడలేదు. వచ్చేపోయే వాహనాలు, వెల్లువలా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయ ప్రాంగణమంతా పసుపు వర్ణ శోభితమైంది.
వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో పార్టీ కార్యాలయానికి వచ్చారు తెలుగు తమ్ముళ్లు.. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకిలోని పార్టీ ఆఫీసు నుంచి 300 కార్లతో ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు.. జాతీయ రహదారిపై దాడి పొడవునా కార్ల ర్యాలీ ఓ రేంజ్‌లో కనిపించింది.
ఇటు విజయవాడ నుంచి ఎంపీ కేశినేని నాని పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో దీక్షా స్థలికి వచ్చారు. హిందూపురం, విజయవాడ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ కోలాహల వాతావరణం కనిపించింది. దీక్ష ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో అక్కడకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. జయజయధ్వానాలు, పసుపు జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు.. లోకేష్ రాకతో కార్యకర్తల కోలాహలం రెట్టింపయింది.. వేల సంఖ్యలో కార్యకర్తలు పోటెత్తడంతో ఓ దశలో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో లోకేష్ మైక్ తీసుకుని కాసేపు ప్రసంగించి వారందరిలో జోష్ నింపారు.
గురువారం కూడా అర్థరాత్రి వరకు ఎన్టీఆర్ భవన్‌కు కార్యకర్తల తాడికి కనిపించింది.. రాత్రి పదిన్నర తర్వాత చంద్రబాబు దీక్ష స్థలిలోనే నిద్రపోయారు.. ఉదయం ఐదు గంటలకే లేచి మళ్లీ దీక్షలో కూర్చున్నారు. ఇక దీక్ష జరిగినంత సేపు అధినేతను పలుకరిస్తూ, ఆయనతో కరచాలనం కోసం కార్యకర్తలు పోటీ పడ్డారు.. వచ్చిన వారందరినీ చంద్రబాబు ఆప్యాయంగా పలుకరించారు. ఇక దీక్షా వేదికపై ప్రసంగించిన నేతలు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.. టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను ముక్త కంఠంతో ఖండించారు. తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.