AP: ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందంతో చంద్రబాబు కీలక చర్చ
అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలువు... ఈ నెల 27 వరకూ రాష్ట్రంలోనే వరల్డ్‌బ్యాంక్ బృందం;
ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రభుత్వం ముందున్న ప్రణాళికలు, వ్యూహాలు, నిధుల సమీకరణ, ఉపాధి అవకాశాలు వంటి అంశాల్ని వారికి చంద్రబాబు వివరించారు. అమరావతిలో ఇప్పటివరకు జరిగిన పనులు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అవకాశాలపై వారితో చర్చించారు. ప్రపంచబ్యాంకు బృందం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఏపీకి వచ్చింది. మొదట నలుగురు సభ్యుల బృందం అమరావతిలో పర్యటించగా.. ఈసారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు. వారంతా ఈ నెల 27 వరకు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారులతో చర్చల్లో పాల్గొంటారు.
తొలి రోజు సీఆర్డీయే కార్యాలయంలో కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అమరావతి ప్రణాళికలు, ఇప్పటివరకు జరిగిన పనులపై వారికి భాస్కర్ సుమారు మూడు గంటల పాటు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వారు సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం భేటీ విశేషాలను సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై వారితో చర్చలు జరిపినట్టు సీఎం ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. ‘అమరావతి నిర్మాణానికి సంబంధించి మన విజన్, ప్రణాళికలపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అధికారులతో చర్చించానని... ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించా’ అని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన నేపథ్యంలో ఈ చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు.