CBN: వైసీపీని బంగాళాఖాతంలో కలపాలి

సంక్రాంతికి సంకల్పం చేయాలన్న చంద్రబాబు... రాతి యుగం పోయి స్వర్ణ యుగం రావాలన్న తెలుగుదేశం అధినేత;

Update: 2024-01-11 01:00 GMT

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తామని 5 కోట్ల ప్రజలు సంక్రాంతికి సంకల్పం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని ధ్వజమెత్తారు. అప్పుడే జగన్‌ రాతియుగం పోయి...టీడీపీ- జనసేన స్వర్ణయుగం వస్తుందన్నారు. రాష్ట్రానికి విభజన కంటే... వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో... రా కదలిరా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు గళమెత్తారు. జగన్ అహంకారమే అయన్ను ముంచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మూడు నెలల్లో వచ్చే టీడీపీ-జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అని అడుక్కుని జనాల్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటి కావాలని ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ'ని తప్పకుండా అమలు చేస్తానని స్పష్టం చేశారు.


వైసీపీ పాలనలో పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోలు, విద్యుత్, తదితర ధరల పెరుగుదలను చంద్రబాబు వివరించారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందా అని ప్రశ్నిచారు. కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. సీపీఎస్‌, ప్రత్యేక హోదా, పోలవరం, ఉద్యోగ కల్పన, వివేక హత్యపై జగన్‌ మాటలు సభలో ప్రదర్శించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రా కదలి రా పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా తునిలో జరిగిన సభల్లో పాల్గొన్నారు.


ఓటమి భయంతోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజల కంటే భూములపైనే ప్రేమ అని విమర్శించారు. విలువైన స్థలాలపై కన్నేసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.వైకాపా ప్రభుత్వం భూరక్షణ పేరుతో భూ భక్షణ చట్టం తెచ్చిందన్న ఆయన, అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత..తాను తీసుకుంటానన్న తెలుగుదేశం అధినేత, 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ'ని తప్పకుండా అమలు చేస్తానని స్పష్టం చేశారు. సైకో పాలనలో ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమైందనిచంద్రబాబు ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డి... ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్ చేసి గెలవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అరాచక పాలకుడిని ఇంటికి పంపాలని ప్రజలంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళితే... 2109 నుంచి తిరోగమనంలో నడిపిస్తున్నారని విమర్శించారు. తాను సీఎంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తే... వైసీపీ పాలనలో యువతను గంజాయి మత్తులో ముంచేశారని ఆరోపించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం... తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News