ఎన్నికల్లో పోటీపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు తొలుత భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. విశాఖ తూర్పు, చోడవరం టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తదితరులు పోటీ చేసి తీరాలని భావించారు.
అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాత్రం వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు పోటీ చేయడం సరి కాదని చంద్రబాబు వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వాస్తవ పరిస్థితుల కోసం చంద్రబాబు ఆరుగురు శాసనసభ్యులతో కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు.
హుందా రాజకీయాలే చేద్దామని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు అందరూ ఏకీభవించారు. ఇప్పటికే బొత్స నామినేషన్ దాఖలు చేయగా, చివరి రోజు మంగళవారం మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి తప్పుకోవడంతో బొత్స విజయం నల్లేరు మీద నడకే కానుంది.