ఒక్క రోజులోనే 95%కి పైగా పెన్షన్లు పంపిణీ చేయడంపై సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) సచివాలయాల సిబ్బందిని అభినందించారు. ‘గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగలేదు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరు అనేది మరోసారి రుజువైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో 94%, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 80% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే జమ అవుతాయని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. జీతాల చెల్లింపుల నిధులు సర్దుబాటు పూర్తైందన్నారు. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.