CM Chandrababu : చిన్నారి మృతి పై సమగ్ర విచారణ చేయాలన్న సీఎం చంద్రబాబు..

Update: 2025-07-11 12:45 GMT

గత రెండు రోజుల క్రితం అంగన్వాడి నుండి బయటకు వెళ్లిన లక్షిత్ అనే చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అంగన్వాడీ కేంద్రం నుండి బయటకు వచ్చిన చిన్నారి దారి తప్పి అడవిలోకి వెళ్లాడు. చీకటి పడడంతో బయటికి వచ్చే దారి తెలియకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. రెండు రోజులపాటు అడవిలో చిక్కుకొని తిండి, నీళ్లు లేకపోవడంతోనే లక్షిత్ చనిపోయాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ప్రకాశం జిల్లా, కంభం మండలం, లింగోజిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కాగా లక్షిత్ మృతి ఘటనపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు. రెండున్నర ఏండ్ల బాలుడు అడవిలో చిక్కుకొని ఆహారం లేక చనిపోవడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే జాగిలాలు, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టామని, డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను నియమించి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించామని ఎస్పీ వివరించారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఐతే తల్లి కాన్పు కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన లక్షిత్, అక్కడ అనధికారికంగా అంగన్‌వాడీ సెంటర్‌కు వచ్చి పోతున్నాడు. ఈ దుర్ఘటనలో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు జరపాలని సిఎం ఆదేశించారు.

Tags:    

Similar News