CM Chandrababu : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ప్రకాశం పంతులు ఒక గొప్ప దేశభక్తుడని చంద్రబాబు కొనియాడారు. తెలుగుజాతి సాహసానికి ఆయన ప్రతీక అని, ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
యువతకు స్ఫూర్తి
మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు తెలుగువారి పౌరుషానికి, సాహసానికి ప్రతీక అని పేర్కొన్నారు. తుపాకీకి ఎదురు వెళ్లి పోరాడిన ఆంధ్రకేసరి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రకాశం పంతులు తన సంపాదన అంతా ప్రజా సంక్షేమానికే ఖర్చు చేశారని, తన నివాసాన్నే ఉద్యమాలకు కేంద్రంగా మార్చుకున్నారని ఆయన వివరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.