మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అయోమయం!
బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవానికి మచిలీపట్నం వచ్చిన జగన్; 550 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల పనులు త్వరలో పూర్తి;
మచిలీపట్నం మెడికల్ కాలేజీలో మొదటి ఏడాది ప్రవేశాలు స్థానిక పిల్లలకే ఇస్తామన్న సీఎం జగన్ మాటలు అయోమయం సృష్టిస్తున్నాయి. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవానికి మచిలీపట్నం వచ్చిన జగన్ 550 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల పనులు త్వరలో పూర్తికానున్నాయన్నారు. మరో మూడు నెలల్లో వైద్య కళాశాలలో మొదటి ఏడాది ప్రవేశాలు జరగనున్నాయని మొదటి ఏడాది ప్రవేశాలు మచిలీపట్నం పిల్లలకే ఇవ్వాలని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఆయన ప్రకటించారు.
దీనిపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. దేశంలో అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు నీట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో జరుగుతాయి. బందరులో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నీట్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగా విద్యార్థులు ఎవరైనా చేరొచ్చు. ఈ కళాశాలలో ప్రవేశాలు ఎవరికి ఇవ్వాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా నాన్‌లోకల్ కోటా కింద కొంత మంది వచ్చి చేరతారు. ఈ నేపథ్యంలో స్థానిక విద్యార్థులకు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి సరైన అవగాహన లేకుండా చెప్పడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.