అమిత్‌షా-జగన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ
ఇవాళ షా మినహా మిగతా కేంద్రమంత్రులు, ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌పై స్పష్టత రాలేదు.;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్న ఆయన.. ఆలయాలపై దాడులు, దర్యాప్తు తీరును వివరించే అవకాశం ఉంది. ఏపీలో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని BJP ఇప్పటికే సీరియస్‌గా తీసుకుంది. ఏపీ బీజేపీ నేతల నుంచి కూడా కేంద్రానికి వరుస ఫిర్యాదులు అందాయి. ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆలయాలపై దాడుల అంశంపై అమిత్‌షాతో చర్చించనున్నారు జగన్.
అటు, 3 రాజధానులకు మద్దతుపైనా అమిత్‌షాకు విజ్ఞప్తులు చేయనున్నారు జగన్. ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ, అమిత్‌షాల వద్ద 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం.. దానికి కేంద్రం నుంచి మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమిత్‌షా-జగన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు, ఇవాళ షా మినహా మిగతా కేంద్రమంత్రులు, ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌పై స్పష్టత రాలేదు. అమిత్‌షాను కలిసాక.. CM తిరిగి అమరావతి వచ్చేస్తారా లేదంటే రేపు కూడా అక్కడే ఉంది మరికొందరిని కలుస్తారా అనేది తెలియాల్సి ఉంది.