YCP: మాకొద్దీ సిద్ధం సభలు

సీఎం జగన్‌ పర్యటనలతో సామాన్యుల అవస్థలు... నేటి రాప్తాడు సిద్ధం సభకు ప్రజల ఇబ్బందులు

Update: 2024-02-18 02:00 GMT

సీఎం జగన్‌ పర్యటన అంటే చాలు సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ రాప్తాడు నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు జనాన్ని తరలించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా తరలించారు. తగినన్ని బస్సులు లేక సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా... చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిద్ధం సభకు జనసమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను తరలించారు.


అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని 74 బస్సుల్లో 54 బస్సులను తరలించారు. ఒక్కసారిగా బస్సులు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు లేక... ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులపై ఆర్టీసీ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు..


సీఎం సభకు కుప్పం నుంచి బస్సులను తరలించారంటూ తెలుగుదేశం నాయకులు.. డిపో ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బస్సులు లేకపోవడంపై డిపో అధికారులను నిలదీశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బస్సులు పంపుతున్నామని డిపో మేనేజర్‌ చెప్పారు. కుప్పం నుంచి 50, చిత్తూరు నుంచి 60, పలమనేరు నుంచి 40, పుంగనూరు నుంచి 70 బస్సులను తరలించారు. బస్సులన్నీ అనంతపురం తరలించడంతో... ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి జిల్లాలో 374 ఆర్టీసీ బస్సులను ఈ సభ కోసం తరలించడంతో తమిళనాడు, కర్ణాటక సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సుల సంఖ్య ఒక్కసారిగా తగ్గడంతో బస్సులో సీట్ల కోసం జనాలు పోటీపడుతున్నారు.

ఇటీవలే గుంటూరు జిల్లాలో నిర్వహించిన వాలంటీర్లకు వదనం సభకు సీఎం జగన్‌ రాకతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్టీసీ బస్సుల తరలింపు, ట్రాఫిక్‌ ఆంక్షలతో జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ చిక్కుకున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' సభ ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సీఎం రాక సందర్భంగా అధికారులు పెట్టిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వెళ్లే దారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీనివల్ల చిన్నచిన్న సీసీ రోడ్ల మీదినుంచి ప్రధాన రహదారిపైకి రావడానికి వీల్లేక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆర్టీసీ, స్కూలు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాల్ని తరలించారు. 

Tags:    

Similar News