ఆంధ్రప్రదేశ్‌లో కట్టడి కాని కరోనా.. విపరీతంగా పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కట్టడి కాని కరోనా.. విపరీతంగా పెరుగుతున్న కేసులు;
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కావడం లేదు. 24 గంటల్లో 63వేల77 మందికి పరీక్షలు నిర్వహించగా 10వేల 603 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 24వేల 767కు చేరింది. అలాగే మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఒక్కరోజులోనే 88 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేల 884కు చేరింది. ఒక్కరోజులో నెల్లూరు జిల్లాలో 14 మంది, చిత్తూరులో 12 మంది, కడపలో 9 మంది, అనంతపురం, పశ్చిమ గోదావరిలో ఏడుగురు చొప్పున, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున..మృత్యువాత పడ్డారు.
మరోవైపు 9వేల 67 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 21వేల754గా ఉంది. ప్రస్తుతం 99వేల 129 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే 58 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడును వెనక్కు నెట్టి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో అత్యధికంగా 7లక్షల 64వేల281 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, రెండో స్థానంలో నిలిచిన ఏపీలో 4లక్షల 24వేల767 కేసులు నమోదయ్యాయి. అటు.. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. కరోనాపై పోరాటంలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రక్షణ సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పు ఎలా అవుతుందని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాధర్ ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు బనాయించారని.. ఐనా భయపడేది లేదని అన్నారు. ఇద్దరు అడ్వొకేట్లతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన ఆయన్ను దాదాపు రెండుగంటల పాటు అధికారులు విచారించారు. ఏప్రిల్‌లో కరోనా కట్టడిపై టీవీ5లో ఫోన్‌లైన్‌లో మాట్లాడారు డాక్టర్ గంగాధర్. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించారు. డాక్టర్లకు పీపీఈ కిట్లు, మాస్కుల కొరతకు సంబంధించిన ఆ వార్తా ప్రసారంపై టీవీ5తో పాటు, డాక్టర్ గంగాధర్‌కు ఏపీ CID అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై విచారణలో భాగంగానే ఆయన విజయవాడలోని CID ఆఫీస్‌కు వెళ్లారు.
ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ను కట్టడి చేయడంలో విఫలమైందని గంగాధర్ అన్నారు. క్షేత్రస్ధాయి పరిశీలనలో అనేక హాస్పిటల్స్‌లో సౌకర్యాలు లేవని చెప్పామని, ఏపీలో కేసుల తీవ్రత పెరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా ? అని నిలదాశారు. తాను మాట్లాడిన మాటలతో ప్రభుత్వ వైద్యుల్లో ధైర్యం వచ్చిందని.. తన మాటల వల్లే కొన్ని మార్పులు జరిగాయని అన్నారు. కావాలంటే వాటిని నిరూపిస్తానన్నారు గంగాధర్. ఇక.. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదువుతండటం ఏపీని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36 లక్షల 66వేల మందికి టెస్టులు నిర్వహించారు.