COVID: ముంచుకొస్తున్న ముప్పు... మళ్లీ కరోనా కలకలం

విశాఖ, కర్నూలులో కరోనా కేసులు నమోదు;

Update: 2025-05-24 04:30 GMT

మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ 19 మళ్లీ పంజా విసురుతోంది. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో కొవిడ్ -19 వ్యాప్తి పెరిగింది. వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్నప్పటికీ తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జేఎన్‌ 1వేరియంట్, దాని ఉప రకాలతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు JN.1 వేరియంట్, దాని సంబంధిత ఉప-రకాలు కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2.86 కుటుంబానికి చెందినదని అంటున్నారు.

ఆసియా దేశాల్లోనే...

జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలు ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కారణంగా కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. జేఎన్‌.1 రకం వేరియంట్‌ పెరగడాన్ని బట్టి.. ఇంతకు మునుపు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో ఈనెల 11-17 మధ్య కాలంలో 33 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్యాంకాక్‌లోనే 6 వేల కేసులున్నాయి. హాంకాంగ్‌లోనూ కొవిడ్‌ కేసులు గత నెల 6-12 తేదీల(6.21)తో పోలిస్తే.. 13.66శాతానికి చేరుకుంది. చైనాలో పాజిటివిటీ రేటు 3.3 నుంచి 6.3శాతానికి పెరిగింది.

భారత్ లోనూ కేసుల నమోదు

దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతుండడంప ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే భారత్ లో 250కుపైగా కొవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదయ్యాయి, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే భారత్‌లోకి కరోనా వైరస్ వేరియంట్లు వెలుగు చూసిన ప్రతీసారి.. దాని మూలాలు కేరళలోనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిన వేళ కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఒక్క మే నెలలోనే కేరళ వ్యాప్తంగా 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ముఖ్యంగా కొట్టాయం, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు పెంచాలని.. ఆస్పత్రుల్లో మాస్క్‌లు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. జలుబు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి వీణా జార్జ్ సూచించారు.

తెలంగాణలో తొలి కేసు

తెలంగాణలో మొదటి కరోనావైరస్ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక వైద్యుడికి ఈ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తొలి కేసు నమోదు కావడంతో, అధికారులు వెంటనే ఆ వైద్యుడిని ఐసోలేషన్‌కు తరలించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

విశాఖలోనూ కొవిడ్ కేసు

విశాఖపట్నంలో కొవిడ్‌ కేసు నమోదైంది. మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్‌ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరింది. అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనూ పరీక్షించి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ఆమె ప్రయాణం చేయలేదని కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశించామన్నారు.

మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ

కరోనా కలకలంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. వీలైనంతవరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి. రైల్వే స్టేషన్, బస్‌ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భవతులు ఇంట్లోంచి బైటికి రావద్దు. తరచూ చేతులు కడుక్కోవాలి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.

Tags:    

Similar News