అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటన చేశారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సిఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
తొలుత రాజధాని ప్రాంతంలో గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సిఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. హైకోర్టు ప్రాంతాన్ని, అఖిల భారత సర్వీసు అధికారుల, ఎంఎల్ఎల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓలో నివాసం భవనాలు సముదాయాలను చూశారు.
ఈ పర్యటనలో సిఎస్ తో పాటు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమి షనర్, ఎస్ఇ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో ప్రగతి మళ్లీ ఊపందుకోనుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.