వైసీపీ నేతలకు గడపగడపలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీసీఎం నారాయణ స్వామికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పెనుమూరు మండలం బి.అగ్రహారం గ్రామంలో ఆయన పర్యటించారు. తొలిసారి గడప గడపకు వచ్చిన ఆయనతో పాటు కుమారై కృపాలక్ష్మికి... ప్రజల ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వృద్ధుడు డ్రైనేజీ లేదని డిప్యూటీ సీఎంను ప్రశ్నించాడు. అయితే...వైసీపీ పథకాలు ఎలా ఉన్నాయని ఆయన్ను అడిగారు నారాయణ స్వామి. డ్రైనేజీ నిర్మించకుండా దోమలతో అవస్థలు పడుతుంటే ఈ పథకాల గోల ఏందంటూ మండిపడ్డారు వృద్ధుడు. దీంతో నారాయణస్వామి అవాక్కయ్యారు. డ్రైనేజీ, విద్యుత్ లైన్లు నిర్మించాలని, త్రాగునీరు అందించాలని, శ్మశానం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విన్నవించుకున్నారు.
మరోవైపు ..నారాయణస్వామి కుమారై కృపాలక్ష్మీకి సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గడపడపలో మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ సందర్భంగా పథకాలు ఇచ్చేది ఎవరమ్మా? గుర్తు ఏంటమ్మా అని ఓ వృద్ధురాలిని ప్రశ్నించారు. దీంతో ఆ వృద్దురాలు సైకిల్ గుర్తు అనగానే కృపాలక్ష్మితో పాటు స్థానిక వైసీపీ నేతలు అవాక్కైయ్యారు. చివరికి వైసీపీ నేతలు..గదమాయించి వారి పార్టీని, గుర్తును పదేపదే ఆ వృద్ధురాలితో చెప్పించారు.