Kakinada Port : తాబేళ్లు వలలో పడితే తీసుకురావద్దు.. కాకినాడ పోర్టు అధికారుల హెచ్చరిక
గత కొన్ని రోజులుగా అత్యంత అరుదైన ఆలివ్ గ్రిడ్లీ తాబేళ్ళు కాకినాడ రూరల్ వాకిలపూడి సమీపంలో చనిపోతున్నాయి. మత్స్యకారుల వేసిన వలలు, బోట్లు తగిలి చనిపోతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ఇవి చనిపోయి కనిపించాయి. ఇప్పటికే హోప్ ఐలాండ్ పరిసర ప్రాంతంలో బయట నిషేధించారు. అయినప్పటికీ తాబేళ్ళు చనిపోతున్నాయి. అత్యంత అరుదైన ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీశాఖ కోరంగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఒడ్డున ఉన్న తాబేళ్లను పట్టుకుని సముద్రంలో వదిలేసారు. అదే విధంగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. తాబేళ్లను పరిరక్షించాలని.. అవి వలలో పడినప్పుడు బయటకు తీసుకురావద్దని సూచించారు. సముద్రంలోనే వదిలేయాలని ఆదేశించారు. అధికారులు తీసుకున్న చర్యలను పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.