2019 ఎన్నికల్లో ఓటమి తనలో మరింత కసిని పెంచిందన్నారు మంత్రి నారా లోకేష్. దాని ఫలితమే 2024లో కనిపించిందని.. ప్రతి విద్యార్థి జీవితంలో సవాళ్లను స్వీకరించి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. నెల్లూరులో వీఆర్ స్కూల్ ను ప్రారంభించిన ఆయన కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
పేదరికం నుంచి బయట పడాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గమని అన్నారు మంత్రి లోకేష్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడవ తరగతి చదివే పర్నిక్ సాయి మంత్రిని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రపంచాన్ని విద్య ఏ రకంగా మారుస్తుంది? అని అడగగా.. మంచి ప్రశ్న అడిగావు అని మెచ్చుకున్నారు .ఎంతటి పేదవారైనా చదువు ద్వారా ఉన్నత స్థాయికి వెళ్లగలరని.. ఎడ్యుకేషన్, ఇమ్మిగ్రేషన్ బలమైన సాధనాలనీ బదులిచారు. నువ్వు బాగా చదువుకొని ఓ కంపెనీ ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. అనంతరం ప్లేగ్రౌండ్ ను పరిశీలించిన మంత్రి లోకేష్ విద్యార్థులతో కాసేపు సరదాగా ఆటలు ఆడారు.