AP: చంద్రబాబు, పవన్‌పై రాయి దాడి యత్నాలు
ఎన్నికల ప్రచారాల్లో ఉద్రిక్తతలు... బాంబులకే భయపడలేదన్న బాబు;
విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఇది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పనేనని చంద్రబాబు మండిపడ్డారు. తెనాలిలో పవన్ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని... నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తానని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారని... క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు అన్నారు. జగన్ సభలో కరెంటు పోయిందని... దానికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీదకు నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయి. రాళ్లు నేను వేయించినట్లు కొందరు మాట్లాడారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతాలు ఇస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రచారం చేసిన ఆయన ఏపీలో కులగణన మాత్రమే కాదు, ప్రతిభాగణన కూడా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో మహిళల కోసంప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కకులాన్ని నమ్ముకుని తాను రాజకీయం చేయట్లేదన్న పవన్..... రాష్ట్ర ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సీఎం జగన్ అధికార గర్వంతో అందరినీ బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. అధికార గర్వం ఉన్న వారిని ప్రజలే వెంటపడి తరుముతారన్న పవన్ ఎన్నికల్లో దుష్ట పాలనకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.