AP Power Crisis: ఏపీలో మరోసారి విద్యుత్ బాదుడు.. ఎనర్జీ డ్యూటీ భారీగా పెంపు..
AP Power Crisis: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి విద్యుత్ బాదుడుకు ఆదేశాలు జారీచేసింది.;
AP Power Crisis: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి విద్యుత్ బాదుడుకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని పారిశ్రామిక, వాణిజ్య, ఆక్వారంగాలకు కరెంట్ షాక్ ఇచ్చింది. పరిశ్రమ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్స్ ఎనర్జీ డ్యూటీపై 6 పైసల నుంచి రూపాయికి పెంచింది. అంటే ఒకేసారి 94 పైసలు పెంచుతూ ఉత్వర్వులు జారీచేసింది. ఆక్వా రైతులకు ఇది భారంగా మారనుంది. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లపై ప్రస్తుతం యూనిట్‌కు ఆరు పైసల చొప్పున 'ఎనర్జీ డ్యూటీ' వసూలు చేస్తున్నారు.
దీనిని ఒకేసారి రూపాయికి పెంచారు. ఈనెల 8వ తేదీనే ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గృహ వినియోగంపై ఉన్న ఎనర్జీ డ్యూటీ... 6 పైసలను యథాతథంగా ఉంచింది. వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లపై బాదుడుతో 1600 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని ఇంధన శాఖ తెలిపింది. కానీ దీని భారం కనీసం 3వేల కోట్ల పైనే ఉంటుందని పారిశ్రామిక వర్గాలు చెపుతున్నాయి.
ఈ ఎనర్జీ డ్యూటీ ప్రకారం ఐదెకరాలలోపు చెరువులకే సబ్సిడీ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా రైతులనూ దొంగ దెబ్బ తీసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా... విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1 రూపాయి 50 చొప్పున వసూలు చేసేవారు. రాయితీ అందించేవారు. ఇకపై దీనిని ఐదెకరాలలోపు చెరువులకు మాత్రమే పరిమితం చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.
ఐదెకరాలు దాటిన ఆక్వా చెరువుల నుంచి యూనిట్‌కు రూ.3 రూపాయల 85 చొప్పున వసూలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఆక్వాజోన్ పరిధిలోని చెరువులన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ పరిధి బయట ఉన్న చెరువులు విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్‌కు రూ.3రూపాయల 85 చెల్లించాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఎనర్జీ డ్యూటీని భారీగా పెంచడంపై వాణిజ్య, పరిశ్రమల వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
రెండేళ్లుగా కరోనాతో అతలాకుతలమయ్యామని... ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండగా ఒవైపు విద్యుత్ చార్జీల పెంపు, మరోవైపు పవర్ హాలిడేతో దెబ్బ మీద దెబ్బ కొట్టారని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎనర్జీ డ్యూటీ బాదుడును ఎంతమాత్రం భరించలేమని ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలను కొనసాగించలేమని అంటున్నారు. అప్పటికే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగానికి ఇది పెను భారంగా మారనుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.