Fake Swamiji Arrested : శాంతి పూజలు అంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగ స్వామీజీ అరెస్ట్!
'మీ ఇంట్లో అశుభం జరుగుతుంది.. శాంతి పూజలు చేయిస్తా'నంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వామీజీని ఏలూరు జిల్లా చాట్రాయి పోలీసులు పట్టుకున్నారు. నూజివీడు గ్రామీణ సీఐ కార్యాలయంలో డీఎస్సీ కేవీవీఎన్పీ ప్రసాద్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అశ్వరావుపేట పెరయాగూడేనికి చెందిన తూరపాటి బాలయ్య స్వామీజీ వేషం వేసి ఆరుగొలను పేటలోని ఒకరింట్లో వారి అల్లుడు ఇటీవల చనిపోయాడని తెలుసుకుని.. వారి ఇంటికెళ్లాడు. మీ ఇంటి పెద్ద మనిషికి చేతబడులు చేస్తున్నారని, దాని ఫలితంగానే అల్లుడు కూడా మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడికి కూడా వాహన గండం ఉందని, అది తొలగిపోవాలంటే కనకదుర్గ గుడిలో పూజలు చేయాలని మాయ మాటలు చెప్పాడు. దానికి రూ.61 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సదరు నగదు తీసుకుని ద్విచక్రవాహనంపై పారిపోయాడు. ఇదే విధంగా నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలోనూ ఒక ఇంటికెళ్లి వారి చిన్న కొడుకు జీవితం బాగోలేదని... సమ్మక్క సారక్క ఆలయంలో శాంతి పూజలు చేస్తే బాగుంటుం దని నమ్మించి రూ.26,400 తీసు కుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం పోలవరం నుంచి చాట్రాయి వైపు తూరపాటి బాలయ్య స్వామీజీ వేషంలో వెళ్తూ.. పోలీసులను చూసి పారిపోవాలని యత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతనే దొంగ స్వామీజీ అని తేలింది. అరెస్టు చేసి రూ.80 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, పూజ సామగ్రి తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇలాంటి దొంగ బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.