AP Film Producers : ఏపీసీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ కోరిన సినీ నిర్మాతలు
టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో భేటీ అయ్యారు. నిర్మాతల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరింది. ఈ మేరకు మంత్రికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామని చెప్పారు. ఆ మేరకు వారితో భేటీ అయ్యాం. ఈ సమావేశానికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. సినిమా పరిశ్రమలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇద్దరి అభిప్రాయాలను వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలి.’’ అని ఆయన పేర్కొన్నారు.
అవసరమైతే ఈ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జోక్యం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.