Krishna River : కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద.. గేట్లను ఎత్తి నీరు విడుదల..

Update: 2025-08-25 07:00 GMT

అల్పపీడనాలు ఉపరితల ద్రోణుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి వరద ప్రవాహం నిరంతరాయంగా వస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. దీంతో అధికారులు శ్రీశైలం 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3,38,739 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 గేట్లు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 4,05,124 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం అధికారులు సైతం 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా గేట్లను ఎత్తడంతో పలు ప్రాజెక్టుల వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

Tags:    

Similar News