మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈమె స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మం. కోడూరు. సీతాదేవి ముదినేపల్లి నుంచి 1985, 94లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్(చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు యెర్నేని రాజారామచందర్(దివంగత ) రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు.