AP : మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Update: 2025-08-13 07:00 GMT

రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ‘స్త్రీశక్తి’ సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్టు సామర్ధ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని... ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుని, దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని సీఎం నిర్దేశించారు. సర్వీస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు.

సమస్యలు వెంటనే పరిష్కరించేలా...

‘ఈపోస్ మిషన్లకు జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలి. ఆర్టీజీఎస్‌తో అనుసంధానమై పనిచేయాలి. సమస్యలు ఎక్కడైనా ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్దంగా ఉండాలి. బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు చెత్త తొలిగించాలి. టాయిలెట్లను ప్రతి 2 గంటలకు ఒకసారి శుభ్రపరచాలి. దీనిపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ప్రయాణికులు ఎక్కడా అసౌకర్యానికి గురి కాకూడదు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. రూ.30 కోట్లతో చేపట్టిన బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. అవసరమైన చోట్ల కొత్తగా ఫ్యాన్లు, చైర్లు ఏర్పాటు చేయాలి. ప్యాసింజర్లకు సహకరించేలా 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్‌లో అందుబాటులో ఉండాలి.

బ్రేక్ డౌన్‌లు తలెత్తకుండా…:

రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడపాల్సి వస్తుండటంతో బస్సులు ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని వివరించారు. వీరికి జీరో ఫేర్ టిక్కెట్‌ కోసం ఈపోస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ ఆగస్ట్ 14కల్లా అప్డేట్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు. స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి ఈనెల 15న మధ్యాహ్నం విజయవాడలోని పండింట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రారంభిస్తారు. మరోవైపు సమీక్షలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు అందించే సాయంపైనా అధికారులతో చర్చించారు. ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో కలిపి... కొత్త పథకం రూపొందించేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

Tags:    

Similar News