AP : నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ జమ

Update: 2024-05-18 08:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్-2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) శనివారం నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది.

వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల స్థాయి లాంటి ఆరు ప్రామాణికాల ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు నిబంధనల మేరకు లెక్క తేల్చారు. ఇందులో ఉద్యాన పంటల విస్తీర్ణం 92,137 ఎకరాలు కాగా వ్యవసాయ పంటలు 13,32,108 ఎకరాలున్నాయి.

ఇక రబీ 2023–24 సీజన్‌ ఆరంభంలో మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఇందులో 64,695 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 5,99,685 ఎకరాలు వ్యవసాయ పంటలున్నాయి. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్‌ తుపాన్‌తో నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు చొప్పున 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీగా లెక్కతేల్చారు.

కాగా, కరువు సాయంతో పాటు మిచాంగ్‌ తుపాన్‌ పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. పోలింగ్‌ ముగిసే వరకు ఇతర డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది.

తాజాగా ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News