gudivada: గుడివాడలో రప్పా రప్పా రాజకీయాలు
గుడివాడలో రోజంతా ఉద్రిక్తత... టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ.... చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు ఫ్లెక్సీలు;
గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ , టీడీపీ రెండు ఒకే రోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని వస్తారన్న ప్రచారం జరిగింది. రప్పా రప్పా నరుకుతామని పేర్ని నాని హెచ్చరించిన వీడియో వైరల్ అయిన సమయంలో.. ఆయన కూడా వస్తారని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున గుడివాడలో గుమికూడారు. , ఈ క్రమంలోనే గుడివాడలోని కే కన్వెన్షన్లో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ సమావేశం నిర్వహించింది వైసీపీ. ఈ సమావేశానికి ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు. అయితే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని దూరంగా ఉన్నారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. సొంత నియోజకవర్గంలో జరిగిన వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని దూరంగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అనారోగ్య కారణాలతోనే కొడాలి నాని ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. అనారోగ్య కారణాలతో కొడాలి నాని గుడివాడ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అధ్యక్షత వహిస్తున్నారు. మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ..గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లీక్సీని ఏర్పాటు చేశారు.
నాని శకం ముగిసినట్లేనా..?
గతంలో గుడివాడ నియోజకవర్గం అంటే నానీ అడ్డా. అక్కడ ఆయన చెప్పిందే వేదం. వరుస విజయాలతో జోరుమీదున్న ఉన్న నానీకి 2024 ఎన్నికలు స్పీడ్ బ్రేకర్ గా నిలిచాయి. అక్కడ టీడీపీ నుంచి వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు. నానీకి ఓటమిని రుచి చూపించారు. ఆ తర్వాత గుడివాడలో నానీ వర్గం హడావిడి బాగా తగ్గింది. ఎన్నికల తర్వాత ఆయన అజ్ఞాతంలో ఉండటం, ఆస్పత్రిలో ఉండటంతో అక్కడ వైసీపీ కార్యక్రమాలు కూడా లేవు. తీరా ఇప్పుడు మళ్లీ నానీ వర్గం అలర్ట్ అయింది. ఆయన ఆస్పత్రినుంచి బయటకు రావడంతో పార్టీ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వర్గం నానీ అనుచరులకు షాకిచ్చింది.