MUSEUM: అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం
టీడీపీకి-నేతన్నలకు అవినాభావ సంబంధం.. నేతన్నలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా;
భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకువచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. పొందూరు ఖద్దర్ వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి, చేనేత వర్గానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే సంస్థ చేనేత అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కిచెప్పారు. రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉంది. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. 55,500 మంది చేనేత కార్మికులకు రూ.2లక్షలు చొప్పున రూ.27కోట్లు రుణాలు ఇచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం." అని గుర్తు చేశారు.
చేనేత కార్మికులపై వరాల జల్లు
చేనేత కార్మికులపై వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చూసే బాధ్యత తనదేనని వెల్లడించారు. చేనేత మగ్గాలు ఉన్నవారికి, పవర్ లూమ్‌లకు ఉచితంగా విద్యుత్ అందింస్తామని తేల్చి చెప్పారు. కొత్త డిజైన్లపై చేనేత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి.. వారి ఆదాయాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. చేనేతపై జీఎస్టీని కూడా రీయంబర్స్ చేస్తామని.. చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో అక్కడికి వచ్చిన చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు.. నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకవేళ పవర్ లూమ్ ఉన్నవారికి నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు జీఎస్టీలో 5 శాతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చేనేత పుట్టిన నేల
ఈ సందర్భంగా చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేనేత ఒక సంపద అని చంద్రబాబు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖద్దరును మహాత్మాగాంధీ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందుతూ వస్తోందని.. నాగరికతకు మూలం నేతన్ననే అంటూ ప్రశంసలు కురిపించారు. కాకతీయులు పాలించిన కాలంలో.. నాణేలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు తొలిసారిగా 50ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం. చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి.. అందుకే 50 ఏళ్లకే పింఛన్ తీసుకొచ్చాం. 50శాతం సబ్సిడీతో మర మగ్గాలకు రూ.80కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల నుంచే 200యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. చేనేతకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది’’అని చంద్రబాబు అన్నారు.