బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోత వాన కురుస్తుండటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోని వరద నీరు చేరింది.