Home Minister Anitha : ఏపీలో భారీ వర్షాలు.. సహాయక చర్యలపై హోంమంత్రి అనిత సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని చెప్పారు.
విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాల వల్ల ఎక్కడెక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తాయో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఒకట్రెండు చోట్ల మినహా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు ఆయనకు తెలిపారు. ఉత్తరాంధ్రలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి గొట్టిపాటి సూచించారు.