బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వేటాడే మత్స్యకారులంతా బోట్లను ఒడ్డుకు చేర్చి ఇళ్ళకే పరిమితమయ్యారు. రెండు రోజుల నుంచి ఉప్పాడ సముద్రం అతలాకుతలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడటం, సముద్రానికి అతి దగ్గరలో ఉన్న సూరాడ పేట, మాయా పట్నం గ్రామాలకు చెందిన గృహాలపై అలలు విరుచుకుపడ్డాయి. దీంతో అలల ధాటికి పలు గృహాలు నేలమట్టమయ్యాయి. సముద్రపు అలల తాకిడికి తమ ఇండ్లు కూలిపోయాయని.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.