Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఆ పోస్టుల భర్తీలో..
Andhra Pradesh: వైఎస్సార్ క్లినిక్, వెల్ బీయింగ్ సెంటర్లలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది;
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ క్లినిక్, వెల్ బీయింగ్ సెంటర్లలో 1681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఈ నియామక ప్రక్రియలో ఆయుష్ డాక్టర్లను అనుమతించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ ముడకన శివకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.. నేషనల్ హెల్త్ పాలసీ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆయుష్ డాక్టర్లను అనుమతించకపోవడం చట్ట విరుద్ధమని వాదించారు.
అన్ని రాష్ట్రాలు నియమాక ప్రక్రియలో ఆయుష్ డాక్టర్లను అనుమతిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం వారిని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.. పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టింది.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.